Archive for January, 2009
బియ్యం కిలో రూ. 20 కా? ఎక్కడండీ బాబూ?!
ఓ పక్క మన మంత్రి గారు తనిఖీలు చేస్తూ ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం కేవలం 20 రూపాయలకే అమ్మేలా చూస్తున్నామంటారు.. ఇంకో పక్క ముఖ్య మంత్రి గారు చంద్ర బాబు కొట్లలో తప్ప అన్ని చోట్లా 20 కే అమ్ముతున్నారంటూ తనదైన శైలి లో వ్యంగ్యం గా జవాబిస్తారు…
అంత నమ్మకంగా చెప్తుంటే నిజమనే అనుకుందాం… హైదరాబాదులో సాధారణ కిరాణా షాపులో అడిగా.. రూ. 27 అన్నిటికంటే తక్కువ రకం.. రూ. 30 ది ఒక మాదిరిగా ఉంది.. నేను చంద్రబాబు కొట్లలో కొననే కొనను.. అడిగింది మామూలు షాపు.. పోనీ హైదరాబాదు కదా ఎక్కువే ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువే ఉంటుంది అనుకుని, సొంతూరు అమలాపురం లో అడిగా.. ఎక్కడా 26 కి తక్కువే చెప్పలేదు ఎవరూ.. నేను అక్కడ ఉన్న అన్ని బియ్యం రకాల రేట్ల గురించీ అడిగాను మరి…
అసలు ఈ ‘సూపర్ ఫైన్’ బియ్యం అంటే ఏంటి? బయట మామూలుగా మనం కొనే కిరాణా కొట్లలో (పెద్ద షాపులని మర్చిపొండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు) ఈ రకం అమ్మరా? అంటే సాధారణ ప్రజలు తినేది ఈ రకం కాదా? అప్పుడు దాన్ని తక్కువకి అమ్మడం వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? మరి అలా కాకపోతే సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్తున్నట్టా? లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందా? అబ్బే… నాకైతే ఏం అర్ధం కావట్లేదు…!!
కోనసీమ సంక్రాంతి — ప్రభల తీర్థం!!
ప్రతి సంక్రాంతి పండగకి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళడం, కనుమ రోజు ప్రభల తీర్థానికి వెళ్ళడం అలవాటు.. ఈ సారి వెళ్ళినప్పుడు కొన్ని ప్రభలని నా కెమేరా లో బంధించాను…
మరిన్ని ఫోటోలు ఇవిగో ఇక్కడ ఉన్నాయి: http://picasaweb.google.com/phanikumar.bhamidipati/Sankranti2009# (మళ్ళీ వర్డ్ ప్రెస్ లో అప్ లోడ్ చెయ్యలేక లింకు పెడుతున్నా).. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని జగ్గన్నతోటలో ప్రతి సంవత్సరం కనుమ రోజు జరిగే జాతర/తీర్థం ఇది.. (కోనసీమలో ఇంకా కొన్ని ఊళ్ళలో కూడా జరుగుతుంది)..
ఆ అర్ధచంద్రాకారంగా ఉన్న నిర్మాణాన్ని “ప్రభ” అంటారు.. ప్రతి ఊరికి కనీసం ఒక ప్రభ ని తయారుచేస్తారు.. మధ్యలో దేవుడి ఉత్సవ విగ్రహం ఉంటుంది.. ఏ ఊరి వాళ్ళు ఆ ఊరి ప్రభని మోసుకుని మొసలపల్లి అనే ఊరి శివార్లలో ఉన్న తోటలోకి తీసుకువస్తారు.. ముందుగా మొసలల్లి గ్రామ ప్రభలు వస్తాయి…. అన్నిటికంటే ఆఖరున గంగలకుర్రు అనే గ్రామ ప్రభ వస్తుంది… వీటిని పొలాల మీదుగా, కాలువలను దాటించి తీసుకుని వస్తారు… (ఫొటో లో ముందు తీసినది గంగలకుర్రు ప్రభే)… ఈ ప్రభ వచ్చిన తర్వాత దాదాపు ఒక గంట పాటు అన్నీ ఒకేచోట కూడి ఉంటాయి, తర్వాత ఏ ఊరి ప్రభ ఆ ఊరికి తిరిగి వెళ్తుంది.. రాత్రి ఆయా ఊళ్ళలో ఊరేగింపు ఉంటుంది… పచ్చటి కోనసీమ పొలాల మధ్యలో జరిగే తీర్థం, ప్రభలు తీసుకుని రావడం, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది….!!
Cadbury’s బోర్న్ వీటా.. తొందరపడి తాగకండేం!
నాకు రోజూ ఉదయాన్నే పాలలో ఈ ఎనర్జీ (!) డ్రింకులు కలిపి తాగడం చిన్నప్పటినుంచి అలవాటు అయిపోయింది…. సాధారణంగా హార్లిక్స్ గానీ బూస్ట్ గానీ తీసుకునేవాడిని.. ఈ సారి బోర్న్ వీటా ప్రయత్నిద్దాం అనుకున్నా… కొని 10 రోజులు కూడా అవ్వలేదు.. ఎందుకో యధాలాపంగా డబ్బాలోకి చూస్తే, కొద్దిగా ఉండలు కట్టినట్టు అనిపించింది.. బైటికి తీసి చూస్తే, ఒక్కో ఉండ లోనూ, ఒక్కో పురుగు… ఆ మధ్య cadburys చాకొలెట్ లో కూడా ఇలానే పురుగులొచ్చాయని విన్నా… కొత్త డబ్బా.. ఆకర్షణీయమైన ప్యాక్.. పెద్ద పేరున్న కంపెనీ… రోజూ ఆఫీసుకెళ్ళే హడవుడిలో తొందర తొందర గా ఈ పౌడర్ వేడి పాలలో వేసేస్తే…ఛీ.. యాక్…!! bournvita ని ఎంతమంది తాగుతారో తెలియదు గానీ, నేను మాత్రం cadburys ఉత్పత్తులు పూర్తిగా నిషేధిస్తున్నా………..!




