Archive for October, 2009
“మా తెలుగు తల్లికి” పాడనే వద్దా?
ఎట్టకేలకి మన విద్యా శాఖా మంత్రి గారి నుంచి ఒక మంచి ప్రకటన వచ్చింది.. అన్ని పాఠశాల లలో ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని పాడాలి అని ఒక నిబంధన పెడదాం అని.. రోజు మొత్తం లో కనీసం ఒక సారైనా తెలుగు వాడతారులే మంచి విషయం అని సంతోషించా.. వెంటనే తెరాస వాళ్ళ ప్రకటన (తెలంగాణా లో ఉన్న పాఠశాల లలో పాడడానికి వీల్లేదని, బహిష్కరిస్తున్నామని….) అసలు ఈ పాట లో అంతటి తప్పు ఏం ఉందా అనిపించింది.. ఎప్పుడో చిన్నప్పుడు గుంపుల్లో కలిసి పాడిన పాట, అస్సలు గుర్తు లేదు.. ఇంత వ్యతిరేకత ఉంది అంటే, తెలంగాణా సంస్కృతిని అవమానించేలాగా ఉండి ఉండాలి, లేకపోతె ఆ సంస్కృతిని గురించి సరైన ప్రస్తావన లేకపోయి ఉండాలి.. సరే చూద్దాం అని వికీపీడియా లో పాట మొత్తం చదివా… ఒక్క సారి మళ్ళీ చూద్దాం, ప్రాంతాల వారీగా ప్రాధాన్యత ని దృష్టి లో పెట్టుకుని..!
౧.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
(ప్రమాదం లేదు.. ప్రాంతాల ప్రస్తావనే లేదు, అదృష్టం బాగుండి కేవలం పొగడ్తలతో ముగించారు…)
౨.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
(ఇందులో గోదావరి, కృష్ణ నదులు గురించి.. రెండూ కలిపి మూడు ప్రాంతాల
నుంచీ ప్రవహిస్తాయి.. నిజానికి వీటిమీద తెలుగు వారికి పేటెంట్ ఏమీ లేదు,
అవి మరాఠీ లు, కన్నడిగుల సొత్తు కూడా.. అది వేరే విషయం పోనీండి..)
౩.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
(అమరావతి గుంటూరు జిల్లా, కోస్తాంధ్ర..సరే.
త్యాగయ్య 1767 లో తమిళ నాడులో జన్మించిన తెలుగు వాడు.. తెలుగు సంగీతానికి ఎనలేని సేవ చేసిన వాడు..ఒక ప్రాంతానికి చెందుతాడు అని చెప్పలేం.
తిక్కన సోమయాజి నెల్లూరు రాజు మనుమ సిద్ధి దగ్గర మంత్రి.. అయితే, అప్పట్లో నెల్లూరు కాకతీయుల ఆధీనం లో ఉండేది. వారి రాజధాని ఓరుగల్లు (వరంగల్).. మనుమ సిద్ధి రాజ్యం కోల్పోయినప్పుడు సహాయం కోసం ఆయన ఓరుగల్లు వెళితే, అప్పటి రాజు గణపతి దేవుడు ఆయనని ఘనంగా సత్కరించి మనుమ సిద్ధి రాజ్యాన్ని తిరిగి అతడికి అప్పగిస్తాడు.. అందువల్ల తిక్కన కూడాఒక ప్రాంతానికే చెందినా వాడు అని చెప్పలేము.. తెలంగాణా, దక్షిణ కోస్తా రెంటికీ.. )
౪.
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ……
(రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో పరిపాలించిన ధీర మహిళ.. మేము చదువుకునేటప్పుడు 9 వ తరగతి ఉపవాచకం లో రుద్రమదేవి గురించే ఉండేది.. అద్భుతం గా వర్ణించారు.. ప్రాంతం విషయానికి వస్తే తెలంగాణా, కానీ అన్ని తెలుగు ప్రాంతాలనూ పరిపాలించిన రాణి.. సరే, తెలంగాణా అనుకుందాం.
మల్లమ్మ గురించి నాకు ఎక్కడా దొరకలేదు.. ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు.
కృష్ణరాయలు, తిమ్మరుసు తెలిసున్నవారే కదా… విజయనగర సామ్రాజ్యానికి మహారాజు, “దేశ భాషలందు తెలుగు లెస్స” అని నినదించి తెలుగు కి స్వర్ణ యుగాన్ని తెచ్చి పెట్టిన వాడు రాయలు.. ఆయన మహామంత్రి తిమ్మరుసు..ప్రాంతానికి వస్తే, సీమ మొత్తం గా, కోస్తాంధ్ర, తెలంగాణా లలో సగం కంటే ఎక్కువ ఈ రాజ్యం లో ఉండేవి…పోనీ వీళ్ళిద్దరూ సీమ వాళ్ళే అనుకుందాం..!)
మొత్తం గా చూస్తే (మల్లమ్మ తప్పించి),
తెలంగాణా – 2 (రుద్రమ దేవి, తిక్కన)
కోస్తాంధ్ర – 2 (అమరావతి, తిక్కన)
రాయలసీమ – 2 (రాయలు, తిమ్మరుసు)
సరే తిక్కన తెలంగాణా వాడు కాదు అనుకుందాం వాదన కోసం, అయినా సరే రుద్రమ్మ ఉంది గా! ఇప్పుడు నాకు అర్ధం కానిది తెరాస వాళ్ళ గోల ఏంటి అని.. రాష్ట్రానికి, ఒక మంచి తెలుగు పాటకీ లంకె ఎందుకు అని.. ఇందులో కించపరచడం ఎలాగా లేదు.. పోనీ కొమరం భీం లాంటి వీరుల గురించి లేదు అంటారా?! అలా అయితే, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా ల పరిస్థితి ఏంటి? నాకు నన్నయ, రాజ రాజ నరేంద్రుడు, అల్లూరి సీతారామ రాజు, వంశధార, నాగావళి ఇంకా చాలా కావాలి పాట లో..
కనీసం ఇలాగైనా కాస్త తెలుగు పలుకుతారు పిల్లలు అనుకుంటే, ఈ పుడకలు ఏంటి మధ్యలో! వీళ్ళ లాంటి obviously blatant, stupid fellows నోరు ఎలా మూయించాలో నాకు అర్ధం కాదు. జరుగుతున్న ఈ ఒక్క మంచి పని కూడా వీళ్ళ వల్ల జరక్క పొతే, అంత కంటే దారుణం ఇంకొకటి ఉండదు.. ఇప్పటికే కొంత మంది సన్నాయి నొక్కులు మొదలెట్టారు… “తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా స్కూళ్ళ లో” అంటూ… ఏం, వందేమాతరం అర్ధం తెలిసే పాడామా చిన్నప్పటి నుంచి?? రాష్ట్రం లో ఉన్నందుకు తెలుగు కి ఓ 2 నిమిషాలు కేటాయిస్తే కొంపలేం మునిగిపోవు….
69 comments October 31, 2009
“ఐ నెవర్ స్పీక్ ఇన్ తెల్గూ”
ఇవ్వాళ పొద్దున్నే ఈనాడులో ఈ వార్త చదవగానే ఏదోలా అనిపించింది.. పై ఫోటోలో ఉన్న ఇద్దరు పిల్లల మొహాలు చూడండి.. (ఈనాడు సౌజన్యం) ఏదో తప్పు చేసిన వాళ్ళ లాగ బేలగా.. ఇంత చిన్న వయసులోనే తెలుగు పట్ల ఏహ్య భావం (మాట్లాడినందుకే అందరిముందు శిక్షిస్తే అదే కదా జరిగేది…) కలిగితే, ఇంక మన తెలుగు ఇంకొక రెండు తరాల తర్వాత మృత భాషలలోకి చేరిపోతుంది… నిజంగా మాతృ భాష మీద తెలుగు వారికీ ఉన్న మమకారానికి ఇది ఒక మచ్చు తునక..
అయినా తెలుగు రాకపోవడం ఫ్యాషన్ అయి కూర్చుంది…. మహా మహా తెలుగు సినిమా “ప్రిన్స్” మహేష్ బాబు గారు తనకి తెలుగు రాదనీ, ఆయన తన చిత్రాల పేర్లు కూడా చదవలేడనీ తనే గొప్పగా చెప్పుకుంటాడు.. ఏం, ఆ మాత్రం నేర్చుకోలేడా? ఆ భాషలో పరిశ్రమే కదా తనకి ఇంత పేరు తెచ్చి పెట్టింది? కొంతైనా సామాజిక బాధ్యత లేదా? ఆయనని చూసి కొంత మంది అయినా ప్రోద్భలం పొందుతారు గా…
అసలు ఇంగ్లీష్ లోనే మాట్లాడితే భాష లో పట్టు వచ్చేస్తుందా..? ఇంట గెలవని వాడు రచ్చ గెలవలేడని.. ముందు మాతృభాషలో పట్టు ఉంటేనే కదా పరాయి భాషలు వచ్చేది.. ఇంగ్లీష్ అక్కర్లేదని ఎవరూ అనరు గానీ, ఆ మాట్లాడటం ఒకటి రెండు క్లాసు లకి పరిమితం చెయ్యాలి.. కొత్త భాషలో మాట్లాడటం నేర్చుకోవడం అంటే, మాతృభాష ని అవమానించడం కాదు అని తెలిసేలా చెయ్యాలి.. ఏం.. ఐరోపా లో ఇంగ్లీష్ కాని భాషలు లేవా, ఆ దేశాలలో వాళ్ళు పనికి రాని వాళ్ళు గా మిగిలిపోతున్నారా?
అన్ని సబ్జెక్టు లు ఇంగ్లీష్ లోనే ఉండనివ్వండి ఏం పర్లేదు.. మాతృభాష లో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసేలా చెయ్యక్కర్లేదు గానీ (అసలు అంత తీరిక ఏ పిల్లలకి ఉంది గానీ..).. అసహ్యించుకొనే లాగో, భయపడేలాగో దయచేసి చెయ్యద్దు……
5 comments October 27, 2009



