Posts filed under 'తెలుగు'

“మా తెలుగు తల్లికి” పాడనే వద్దా?

ట్టకేలకి మన విద్యా శాఖా మంత్రి గారి నుంచి ఒక మంచి ప్రకటన వచ్చింది.. అన్ని పాఠశాల లలో ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని పాడాలి అని ఒక నిబంధన పెడదాం అని.. రోజు మొత్తం లో కనీసం ఒక సారైనా తెలుగు వాడతారులే మంచి విషయం అని సంతోషించా.. వెంటనే తెరాస వాళ్ళ ప్రకటన (తెలంగాణా లో ఉన్న పాఠశాల లలో పాడడానికి వీల్లేదని, బహిష్కరిస్తున్నామని….) అసలు ఈ పాట లో అంతటి తప్పు ఏం ఉందా అనిపించింది.. ఎప్పుడో చిన్నప్పుడు గుంపుల్లో కలిసి పాడిన పాట, అస్సలు గుర్తు లేదు.. ఇంత వ్యతిరేకత ఉంది అంటే, తెలంగాణా సంస్కృతిని అవమానించేలాగా ఉండి ఉండాలి, లేకపోతె ఆ సంస్కృతిని గురించి సరైన ప్రస్తావన లేకపోయి ఉండాలి.. సరే చూద్దాం అని వికీపీడియా లో పాట మొత్తం చదివా… ఒక్క సారి మళ్ళీ చూద్దాం, ప్రాంతాల వారీగా ప్రాధాన్యత ని దృష్టి లో పెట్టుకుని..!
౧.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
(ప్రమాదం లేదు.. ప్రాంతాల ప్రస్తావనే లేదు, అదృష్టం బాగుండి కేవలం పొగడ్తలతో ముగించారు…)
౨.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
(ఇందులో గోదావరి, కృష్ణ నదులు గురించి.. రెండూ కలిపి మూడు ప్రాంతాల
నుంచీ ప్రవహిస్తాయి.. నిజానికి వీటిమీద తెలుగు వారికి పేటెంట్ ఏమీ లేదు,
అవి మరాఠీ లు, కన్నడిగుల సొత్తు కూడా.. అది వేరే విషయం పోనీండి..)
౩.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
(అమరావతి గుంటూరు జిల్లా, కోస్తాంధ్ర..సరే.
త్యాగయ్య 1767 లో తమిళ నాడులో జన్మించిన తెలుగు వాడు.. తెలుగు సంగీతానికి ఎనలేని సేవ చేసిన వాడు..ఒక ప్రాంతానికి చెందుతాడు అని చెప్పలేం.
తిక్కన సోమయాజి నెల్లూరు రాజు మనుమ సిద్ధి దగ్గర మంత్రి.. అయితే, అప్పట్లో నెల్లూరు కాకతీయుల ఆధీనం లో ఉండేది. వారి రాజధాని ఓరుగల్లు (వరంగల్).. మనుమ సిద్ధి రాజ్యం కోల్పోయినప్పుడు సహాయం కోసం ఆయన ఓరుగల్లు వెళితే, అప్పటి రాజు గణపతి దేవుడు ఆయనని ఘనంగా సత్కరించి మనుమ సిద్ధి రాజ్యాన్ని తిరిగి అతడికి అప్పగిస్తాడు.. అందువల్ల తిక్కన కూడాఒక ప్రాంతానికే చెందినా వాడు అని చెప్పలేము.. తెలంగాణా, దక్షిణ కోస్తా రెంటికీ.. )
౪.
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ……
(రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో పరిపాలించిన ధీర మహిళ.. మేము చదువుకునేటప్పుడు 9 వ తరగతి ఉపవాచకం లో రుద్రమదేవి గురించే ఉండేది.. అద్భుతం గా వర్ణించారు.. ప్రాంతం విషయానికి వస్తే తెలంగాణా, కానీ అన్ని తెలుగు ప్రాంతాలనూ పరిపాలించిన రాణి.. సరే, తెలంగాణా అనుకుందాం.
మల్లమ్మ గురించి నాకు ఎక్కడా దొరకలేదు.. ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు.
కృష్ణరాయలు, తిమ్మరుసు తెలిసున్నవారే కదా… విజయనగర సామ్రాజ్యానికి మహారాజు, “దేశ భాషలందు తెలుగు లెస్స” అని నినదించి తెలుగు కి స్వర్ణ యుగాన్ని తెచ్చి పెట్టిన వాడు రాయలు.. ఆయన మహామంత్రి తిమ్మరుసు..ప్రాంతానికి వస్తే, సీమ మొత్తం గా, కోస్తాంధ్ర, తెలంగాణా లలో సగం కంటే ఎక్కువ ఈ రాజ్యం లో ఉండేవి…పోనీ వీళ్ళిద్దరూ సీమ వాళ్ళే అనుకుందాం..!)

మొత్తం గా చూస్తే (మల్లమ్మ తప్పించి),
తెలంగాణా – 2 (రుద్రమ దేవి, తిక్కన)
కోస్తాంధ్ర – 2 (అమరావతి, తిక్కన)
రాయలసీమ – 2 (రాయలు, తిమ్మరుసు)

సరే తిక్కన తెలంగాణా వాడు కాదు అనుకుందాం వాదన కోసం, అయినా సరే రుద్రమ్మ ఉంది గా! ఇప్పుడు నాకు అర్ధం కానిది తెరాస వాళ్ళ గోల ఏంటి అని.. రాష్ట్రానికి, ఒక మంచి తెలుగు పాటకీ లంకె ఎందుకు అని.. ఇందులో కించపరచడం ఎలాగా లేదు.. పోనీ కొమరం భీం లాంటి వీరుల గురించి లేదు అంటారా?! అలా అయితే, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా ల పరిస్థితి ఏంటి? నాకు నన్నయ, రాజ రాజ నరేంద్రుడు, అల్లూరి సీతారామ రాజు, వంశధార, నాగావళి ఇంకా చాలా కావాలి పాట లో..
కనీసం ఇలాగైనా కాస్త తెలుగు పలుకుతారు పిల్లలు అనుకుంటే, ఈ పుడకలు ఏంటి మధ్యలో! వీళ్ళ లాంటి obviously blatant, stupid fellows నోరు ఎలా మూయించాలో నాకు అర్ధం కాదు. జరుగుతున్న ఈ ఒక్క మంచి పని కూడా వీళ్ళ వల్ల జరక్క పొతే, అంత కంటే దారుణం ఇంకొకటి ఉండదు.. ఇప్పటికే కొంత మంది సన్నాయి నొక్కులు మొదలెట్టారు… “తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా స్కూళ్ళ లో” అంటూ… ఏం, వందేమాతరం అర్ధం తెలిసే పాడామా చిన్నప్పటి నుంచి?? రాష్ట్రం లో ఉన్నందుకు తెలుగు కి ఓ 2 నిమిషాలు కేటాయిస్తే కొంపలేం మునిగిపోవు….

69 comments October 31, 2009

“ఐ నెవర్ స్పీక్ ఇన్ తెల్గూ”

26pan14a

ఇవ్వాళ పొద్దున్నే ఈనాడులో వార్త చదవగానే ఏదోలా అనిపించింది.. పై ఫోటోలో ఉన్న ఇద్దరు పిల్లల మొహాలు చూడండి.. (ఈనాడు సౌజన్యం) ఏదో తప్పు చేసిన వాళ్ళ లాగ బేలగా.. ఇంత చిన్న వయసులోనే తెలుగు పట్ల ఏహ్య భావం (మాట్లాడినందుకే అందరిముందు శిక్షిస్తే అదే కదా జరిగేది…) కలిగితే, ఇంక మన తెలుగు ఇంకొక రెండు తరాల తర్వాత మృత భాషలలోకి చేరిపోతుంది… నిజంగా మాతృ భాష మీద తెలుగు వారికీ ఉన్న మమకారానికి ఇది ఒక మచ్చు తునక..

అయినా తెలుగు రాకపోవడం ఫ్యాషన్ అయి కూర్చుంది…. మహా మహా తెలుగు సినిమా “ప్రిన్స్” మహేష్ బాబు గారు తనకి తెలుగు రాదనీ, ఆయన తన చిత్రాల పేర్లు కూడా చదవలేడనీ తనే గొప్పగా చెప్పుకుంటాడు.. ఏం, ఆ మాత్రం నేర్చుకోలేడా? ఆ భాషలో పరిశ్రమే కదా తనకి ఇంత పేరు తెచ్చి పెట్టింది? కొంతైనా సామాజిక బాధ్యత లేదా? ఆయనని చూసి కొంత మంది అయినా ప్రోద్భలం పొందుతారు గా…

అసలు ఇంగ్లీష్ లోనే మాట్లాడితే భాష లో పట్టు వచ్చేస్తుందా..? ఇంట గెలవని వాడు రచ్చ గెలవలేడని.. ముందు మాతృభాషలో పట్టు ఉంటేనే కదా పరాయి భాషలు వచ్చేది.. ఇంగ్లీష్ అక్కర్లేదని ఎవరూ అనరు గానీ, ఆ మాట్లాడటం ఒకటి రెండు క్లాసు లకి పరిమితం చెయ్యాలి.. కొత్త భాషలో మాట్లాడటం నేర్చుకోవడం అంటే, మాతృభాష ని అవమానించడం కాదు అని తెలిసేలా చెయ్యాలి.. ఏం.. ఐరోపా లో ఇంగ్లీష్ కాని భాషలు లేవా, ఆ దేశాలలో వాళ్ళు పనికి రాని వాళ్ళు గా మిగిలిపోతున్నారా?
అన్ని సబ్జెక్టు లు ఇంగ్లీష్ లోనే ఉండనివ్వండి ఏం పర్లేదు.. మాతృభాష లో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసేలా చెయ్యక్కర్లేదు గానీ (అసలు అంత తీరిక ఏ పిల్లలకి ఉంది గానీ..).. అసహ్యించుకొనే లాగో, భయపడేలాగో దయచేసి చెయ్యద్దు……

5 comments October 27, 2009

“అటునిటు జోడించు” — చక్కటి తెలుగు సరదా ఆట ఆన్ లైన్ లో!

వ్వాళ ఫేసు బుక్ లో తెలుగు లో ఆడుకునే పదాల ఆట కోసం ఒక అప్లికేషను ని విడుదల చేసారు.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు వేరొక కంపెనీ తో ఒప్పందం తో దీనిని విడుదల చేసారట..

ఇంతకూ ముందు ఎక్కడా తెలుగులో ఇలాంటి అప్లికేషను చూడలేదు, అదీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో.. చాలా ఆనందమేసింది.. దీన్ని ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఆడితే ఇంకా మజా వస్తుంది.. తెలుగు పదాలు నేర్చుకోవాలనుకునే వారికీ, నేర్చుకుంటున్న చిన్న పిల్లలకి చాల అద్భుతంగా ఉపయోగపడుతుంది.. మీకు ఫేసు బుక్ లో ఎకౌంటు ఇప్పటికే ఉంటే, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషను ని:
http://apps.facebook.com/atunitu_jodinchu/
ఇంకా హిందీ, మరాఠీ, తమిళ్ లో కూడా విడుదల చేసారు:
http://apps.facebook.com/ulatpalatke_hindi/
http://apps.facebook.com/ulatoonpalatoonjodaa/
http://apps.facebook.com/taavi_taavi/

ఐతే ఇది ఇంకా బీటా వెర్షన్ కాబట్టి చిన్న చిన్న బగ్గులు కనబడుతుంటాయ్..అలాగే ఇవ్వాళే విడుదలయ్యింది కాబట్టి నేను కూడా ఇంకా పూర్తిగా  ఎక్స్ ప్లోర్ చెయ్యలేదు…
మన బ్లాగర్ల లోని  తెలుగు భాషాభిమానులకి ఈ విషయం తప్పకుండా తెలియాలని ఇక్కడ రాస్తున్నా… :)

2 comments June 1, 2009

ఓటరు గా నమోదు చేసుకోండి.. జనవరి 15, 21, 22 తేదీ లలో..

మీరు గానీ, మీ ఇంట్లో వాళ్ళు గానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ, ఎవరైనా ఇంకా ఓటరు గా నమోదు చేసుకోలేదా? జనవరి 14, 15, 21, 22 తేదీలలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూలుకి గానీ, మున్సిపల్ కార్యాలయానికి గానీ వెళ్ళండి. ఈ తేదీలలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, లేదా ఉన్న జాబితా లో మీ వివరాలూ మార్చుకోవచ్చు…. శనివారం, ఆదివారం.. శెలవు రోజులే కాబట్టి వీలు చూసుకుని ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సాయంత్రం 5 గంటల లోపు…

ఇక నేను ఈ మధ్యే శేరిలింగంపల్లి శాసన సభ ఓటరుని అయ్యాను… :) కొండాపూర్ లో నమోదు చేయించుకున్నాను.. ఎవరైనా అదే ప్రాంతం లో ఉంటుంటే, దగ్గరలో ఉన్న కొత్తగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కి వెళ్ళి నమోదు చేయించుకోవచ్చు… కొండాపూర్ X రోడ్స్ దగ్గరున్న పోలిస్ బెటాలియన్ దగ్గర అడగండి.. అక్కడి నుంచి 2 నిమిషాల దూరం…

Add comment February 14, 2009

బియ్యం కిలో రూ. 20 కా? ఎక్కడండీ బాబూ?!

ఓ పక్క మన మంత్రి గారు తనిఖీలు చేస్తూ ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం కేవలం 20 రూపాయలకే అమ్మేలా చూస్తున్నామంటారు.. ఇంకో పక్క ముఖ్య మంత్రి గారు చంద్ర బాబు కొట్లలో తప్ప అన్ని చోట్లా 20 కే అమ్ముతున్నారంటూ తనదైన శైలి లో వ్యంగ్యం గా  జవాబిస్తారు…

అంత నమ్మకంగా చెప్తుంటే నిజమనే అనుకుందాం…  హైదరాబాదులో సాధారణ కిరాణా షాపులో అడిగా..  రూ. 27 అన్నిటికంటే తక్కువ రకం.. రూ. 30 ది ఒక మాదిరిగా ఉంది.. నేను చంద్రబాబు కొట్లలో కొననే కొనను.. అడిగింది మామూలు షాపు.. పోనీ హైదరాబాదు కదా ఎక్కువే ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువే ఉంటుంది అనుకుని, సొంతూరు అమలాపురం లో అడిగా.. ఎక్కడా 26 కి తక్కువే చెప్పలేదు ఎవరూ.. నేను అక్కడ ఉన్న అన్ని బియ్యం రకాల రేట్ల గురించీ అడిగాను మరి…

అసలు ఈ ‘సూపర్ ఫైన్’  బియ్యం అంటే ఏంటి? బయట మామూలుగా మనం కొనే కిరాణా కొట్లలో (పెద్ద షాపులని మర్చిపొండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు) ఈ రకం అమ్మరా? అంటే సాధారణ ప్రజలు తినేది ఈ రకం కాదా? అప్పుడు దాన్ని తక్కువకి అమ్మడం వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? మరి అలా కాకపోతే సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్తున్నట్టా? లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందా?  అబ్బే… నాకైతే ఏం అర్ధం కావట్లేదు…!!

4 comments January 25, 2009

కోనసీమ సంక్రాంతి — ప్రభల తీర్థం!!

ప్రతి సంక్రాంతి పండగకి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళడం, కనుమ రోజు ప్రభల తీర్థానికి వెళ్ళడం అలవాటు.. ఈ సారి వెళ్ళినప్పుడు కొన్ని ప్రభలని నా కెమేరా లో బంధించాను… :)

sankranti-2009-027 గంగలకుర్రు ప్రభ తీసుకురావడం…

sankranti-2009-042 ప్రభలన్నీ ఒకే చోట…

మరిన్ని ఫోటోలు ఇవిగో ఇక్కడ ఉన్నాయి: http://picasaweb.google.com/phanikumar.bhamidipati/Sankranti2009# (మళ్ళీ వర్డ్ ప్రెస్ లో అప్ లోడ్ చెయ్యలేక లింకు పెడుతున్నా).. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని జగ్గన్నతోటలో ప్రతి సంవత్సరం కనుమ రోజు జరిగే జాతర/తీర్థం ఇది.. (కోనసీమలో ఇంకా కొన్ని ఊళ్ళలో కూడా జరుగుతుంది)..

ఆ అర్ధచంద్రాకారంగా ఉన్న నిర్మాణాన్ని “ప్రభ” అంటారు..  ప్రతి ఊరికి కనీసం ఒక ప్రభ ని తయారుచేస్తారు.. మధ్యలో దేవుడి ఉత్సవ విగ్రహం ఉంటుంది.. ఏ ఊరి వాళ్ళు ఆ ఊరి ప్రభని మోసుకుని మొసలపల్లి అనే ఊరి శివార్లలో ఉన్న తోటలోకి తీసుకువస్తారు.. ముందుగా మొసలల్లి గ్రామ ప్రభలు వస్తాయి…. అన్నిటికంటే ఆఖరున గంగలకుర్రు అనే గ్రామ ప్రభ వస్తుంది… వీటిని పొలాల మీదుగా, కాలువలను దాటించి తీసుకుని వస్తారు… (ఫొటో లో ముందు తీసినది గంగలకుర్రు ప్రభే)…  ఈ ప్రభ వచ్చిన తర్వాత దాదాపు ఒక గంట పాటు అన్నీ ఒకేచోట కూడి ఉంటాయి,   తర్వాత ఏ ఊరి ప్రభ ఆ ఊరికి తిరిగి వెళ్తుంది.. రాత్రి ఆయా ఊళ్ళలో ఊరేగింపు ఉంటుంది… పచ్చటి కోనసీమ పొలాల మధ్యలో జరిగే తీర్థం, ప్రభలు తీసుకుని రావడం, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది….!!

7 comments January 24, 2009

MMTS ప్రయాణం…సౌకర్యం, సుఖవంతం!

(మీరు హైదరాబాద్ నుంచి సొంతూరుకి రైలు లో వెళ్ళాలనుకోండి.. స్టేషన్ కి వెళ్ళడానికి MMTS నే వాడండి.. ఎందుకంటే…)

అక్టోబరు 24వ తేదీ.. దీపావళి కి ఇంటికి వెళ్ళడానికి నెల ముందే గౌతమి ఎక్స్ ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకున్నా… సికింద్రాబాద్ లో 9:15కి బయల్దేరుతుంది.. హైదరాబాద్ ట్రాఫిక్ లో కొండాపూర్ నుంచి స్టేషన్ వరకూ బస్సులో వెళ్దామనుకుంటే, ఆ రోజు కూడా సెలవు తీసుకుని ఒక నాలుగు గంటలు ముందు బయల్దేరాలి.. పోనీ ఆటో లో వెళ్ళాలంటే, మా ఊరు వెళ్ళడానికి అయ్యే ఖర్చుకి రెట్టింపు సమర్పించుకోవాలి.. అందుకని…. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా.. ఈ సారి MMTS లో వెళదాం అని….

7:30 కి హైటెక్ సిటీ నుంచి ఒక MMTS రైలు ఉందనీ.. 8 కల్లా సికింద్రాబాద్ వెళ్తుందనీ చెప్పారు మా కొలీగ్స్.. పొనీ ఎంత లేట్ అయినా 9:15 లోపు వెళ్ళిపోతా అనుకున్నాను.. (ఎలాగా గంట పైగా ఖాళీ ఉంటుంది కదా, హోటల్ స్వాతి లో డిన్నర్, కాస్సేపు అలా షాపింగ్, ఇంకా చాలా అనుకున్నా లెండి…) కంపెనీ షటిల్ తీసుకుని, 7:20కల్లా స్టేషన్ లో ఉన్నా…. అక్కడ క్యూ చూస్తే, రెండు కౌంటర్లు, 70 మంది దాకా జనం…. రైలు వచేస్తుందేమో అని కంగారు పడ్డా.. అక్కడే క్యూ లో ముందు ఉన్న ఒక అతన్ని ప్రాధేయపడి, నాకొక టికెట్ కొనిపించి, కంగారుగా ప్లాట్ ఫాం మీదకెళ్ళా.. అక్కడొక 400 మంది దాకా ఉన్నారు….అసలు ఇంతమంది రైలులో ఎలా పడతారని సందేహం వచ్చింది.. అసలే నా చేతిలో రెండు బ్యాగులు…. టైం 7:45 అయ్యింది… 8 అయ్యింది… 8:10 అయ్యింది.. అప్ప్పుడొచ్చింది రైలు.. కానీ లింగంపల్లి వెళ్ళేది….. ఇంకా అది లింగంపల్లి వెళ్ళి తిరిగి రావాలని అర్ధమైంది,….  హైటెక్ నుంచి ఆ టైం లో రోడ్ మార్గంలో వెళ్ళడం కంటే, ప్రయాణం మానుకోవడం మంచిది…. ఈ లోపు, నాంపల్లి వెళ్ళే MMTS రైలు వస్తోందన్నారు…  సరేలే, బేగంపేటలో దిగి, అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చులే అనుకుని రైలెక్కా.. నా టికెట్ తీసుకున్నతని రైలు 8:30 కట… ఇంకేంటి వెళ్ళేది, ప్రయాణం కాన్సిల్ చేసుకున్నానని చెప్పి, ఆ టికెట్ నాకిచ్చేసి చక్కాపోయాడు..  నేనుమాత్రం భారతీయ రైల్వే మీద అపారమైన నమ్మకం తో నాంపల్లి రైలెక్కేసా… మధ్యలో సిగ్నల్ కోసమో దేని కోసమో, రెండుసార్లు ఆపేసాడు.. చుట్టూ చీకటి.. నాకు వేరే ఛాయిస్ ఎలాగా లేదు.. నెమ్మదిగా ఒక్కొక్క స్టేషన్ వస్తున్నాయి…. పెట్టె నిండా జనం.. చుట్టూ టిఫిన్ బాక్సులు, సంచీలు, పెట్టెలు.. ఏది ఎవరిదో అస్సలు తెలియదు…  ఇందులో రోజూ ప్రయాణించే వాళ్ళ మీద జాలి వేసింది… ఎందులో బాంబు ఉందా అని నేను అలా ఆలోచిస్తూ ఉండగా, .”ప్రకృతి చికిత్సాలయం”  వచ్చింది… తర్వాతి స్టేషనే బేగంపేట..  కానీ ఇలా రైలు ప్రారంభం అవ్వగానే, దాని “ఇంజిను ఆగిపోయింది”.. బస్సులూ అవీ ఆగిపోవడం విన్నాను కని ఇలా రైలు ఆగిపోవదం నాకోసమెనేమో…. నా అదృష్టం బాగుండి.. ఒక ఐదు నిమిషాల తర్వాత ఎలాగో ప్రారంభమయ్యింది….

బేగంపేట వెళ్ళే సరికి 8:30… ఆటో తీసేసుకుందాం అరగంట టైం ఉంది కదా అనుకున్నా..  ఒక్కడూ రానంటాడే..”సార్.. స్టేషన్ కాడ మొత్తం జాం  అయ్యినాది…వెళ్ళలేం సార్”.. అంటాడు.. నాకేం చెయ్యాలో అర్ధం కాలా.. ఈ లోపు 8:40 అయ్యింది.. ఇందాకా నేను ఎక్కని రైలు (లింగంపల్లి వెళ్తూంటే చూసినది) వస్తొందని ప్రకటించాడు… సరే.. ఎదో ఒక దారి దొరికిందిలే అనుకున్నా… ఈ స్టేషన్లో ఒక 200 మంది ఉన్నారు..  అది నెమ్మదిగా 8:50కి వచ్చింది… నిజంగా “రైలు నిండిపోవడం” అంటే ఎమిటో అప్పుడు అర్ధమయ్యింది… నా బ్యాగులు కాదు కనీసం చెయ్యి పెట్టడానికి వీల్లేకుండా ఉంది…కిటికీలు కూడా ఖాళీ లేవు..(జనాలు ఆల్రెడీ వేళ్ళాడుతున్నారు)…నాకు ఏం జరుగుతోందో అర్ధమయ్యేలోపు నా బ్యాగులతో సహా కిందికి తొయ్యబడ్డాను. రైలు కనీసం 20 సెకనులు కూడా ఆగకుండా బయలుదేరేసింది… ఇంటికి వెళ్ళిపోయి,  తర్వాతి రోజు  పొద్దున్న జన్మ భూమి ఎక్కాలేమో అనుకున్నా… పరుగుతో స్టేషన్ బైటకి.. మైసమ్మ గుడి దాకా వచ్చా…. అప్పుడే ఒక ఆటో అతను వచ్చి ఆగి ఉన్నాడు… “భయ్యా… .9:15 కో గాడీ హై” అన్నా.. అప్పటికి టైం 8:55… ఎక్కమన్నాడు… “గౌతమి నా సార్?” అనడిగాడు.. అవునన్నా.. ప్లాట్ ఫాం 10 అని, అది స్టేషన్ కి అవతలి వైపు ఉంటుందని.. తనకి షార్ట్ కట్ తెలుసని…వెళ్ళిపోతాం సార్ అని భరోసా ఇచ్చాడు!!.. మినిష్టర్స్ రోడ్, PG రోడ్, ఇంకా నాకు తెలియని రోడ్లు కొన్నింటిలోంచి తీసుకెళ్ళాడు.. నిజానికి నేను బయలుదేరేటప్పటికి నా టికెట్ కంఫర్మ్ అవ్వలేదు…ఈ హడావుడిలో ఉండగానే, ఫ్రెండ్ కి ఫోన్ చేసి, PNR నంబరు ఇచ్చా.. సరిగ్గా 9:08 కి ప్లాట్ ఫాం 10 ముందు ఆపాడు…. 200 ఇవ్వండిసార్ అన్నాడు.. నీకు అంత ఇస్తే నేను మా ఊరు వెళ్ళలేను బాబూ అని చెప్పి.. నా దగ్గరున్న 150 లో వంద కాయితం అతని చేతిలో పెట్టీ, లోపలికి పరిగెత్తా…

అప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇండియన్ రైల్వేస్ site 500 Internal Server Error ఇస్తోందిరా అని చెప్పాడు… అయితే నువ్వు దాన్ని debug చెయ్యరా అని చెప్పి ఫోన్ పెట్టేసా… అప్పటికి 9:12.. కడుపులో ఎలుకలు స్వైర విహారం చేసున్నాయి.. గౌతమి బయలుదేరిందంటే తినడానికి గడ్డి కూడా దొరకదు…  అందుకని అక్కడే ప్లాట్ ఫాం మీద మూడు రోజుల కింద ఫ్రెష్ గా చేసిన గడ్డి (సమోసాలు) మూడు తీసుకున్నాను… అటు పక్కన TC, ఉన్నాడు కానీ అతని చుట్టూ ఒక 20 మంది ఉన్నారు.. WL వాళ్ళనుకుంటా.. నాకేం.. నేను RAC కదా.. ఎదో ఒక దాంట్లో కూర్చుందాం అని లోపలికి ఎక్కేసా… అప్పుడే, మా ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేసి.. ఆ సైట్ పని చేసింది రా.. S5 61 అన్నాడు.. నెను S12 దగ్గర ఉన్నాను… టైం 9:18… రైలు బయల్దేరేసింది… వెంటనే లోపలికి దూకేసి.. నడుచుకుంటూ వెళ్ళి నా సీట్ లో కూలబడ్డాను…

P.S.:1. ఇది నిజంగా జరిగిందే.. ఏ కల్పనా లేదు..

2. ఆ సమోసాలు తినడం వల్ల తర్వాతిరోజు నా పొట్టకేమైందన్నది అప్రస్తుతం.

3. ఆ ఆటో అతను అప్పుడే, నాంపల్లిలో ముంబాయి ఎక్స్ ప్రెస్ మిస్ అయిన ఒకతన్ని బేగంపేట లో దింపి ఆటో ఆపాడట… :)

11 comments November 6, 2008

హైదరాబాద్ బ్లాగరులకు…

బార్ క్యాంప్ హైదరాబాద్ వాళ్ళు “బ్లాగ్ క్యాంప్” ఒకటి ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతని నుంచి ఈ సమాచారం వచ్చింది. మన తెలుగు బ్లాగరులలో ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా పాల్గొనాలని ప్రార్ధన. ఆతను పంపిన ఈ-మెయిల్ ఇక్కడ ఉంచుతున్నా..
(బార్ క్యాంప్ గురించి ఇక్కడ లేదా ఇక్కడ చదవండి)
********************
The barcamp guys of Hyderabad are toying with the idea to organize a BlogCamp in Hyderabad sometime during end of October / early November.Why?
During the last four Barcamps organized in Hyderabad, we found that the camp crowd has been largely (only) techies; which though is an amazing crowd for a demo camp is severely limiting for building a vibrant online community of bloggers who can bring their various view points to the table. Hyderabad is a blogging powerhouse; but its completely underground.
Google boasts of atleast 100 bloggers but I know not one of them and its important to know if I want to get a foot into their door. And with the freetime we have at Oracle, its nobody’s guess on how many active bloggers we might be having!

With BlogCamp Hyderabad our effort is to first and foremost build a Blogroll of Hyderabad Bloggers (planning to roll of a small webplay based on this, what say? :P ) and of course bring up the awareness on the Barcamps, Democamps that we want to have during the next few months.

Whats there in it?
- Meet the virtual bloggers you interact regularly to meet offline. Ok make that other than your work buddies.
- Meet interesting people. [m42 & w4m]
- Form your own communities – Telugu bloggers, Tech bloggers, Story tellers, Athiest bloggers – all you can imagine
- Create awareness about your own blog and create a story that goes with it – SEO? Revenue? Ideas of World Domination?

Why you?
- Simple. I know you and I read your blogs regularly. And you know people that I don’t and you follow up your reading acts really well.

What do I want from you?
- Just get the word out and see if you can get an estimate of how many people would be interested to come and be a part of it.
- In addition to it, maybe be a part of the main organizing team too!

********************
ప్రస్తుతానికి తేదీ అక్టోబరు 27, స్థలం ఇంకా నిర్ణయించలేదు.

2 comments October 5, 2007

ఇంకో సన్మానం!!

టీం ఇండియా 20-20 కప్పు గెలిచింది.. బానేఉంది.. కుర్రాళ్ళు ఉత్సాహంగా ఆడారు…

వాళ్ళకి ముంబాయి లో సన్మానం, అందులో రాజకీయ నాయకుల హడావుడి.. కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించినా ఫర్లేదు…. కుర్రాళ్ళు కష్టపడ్డారు కదా.. ఎంజాయ్ చేసారు..

కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల సొమ్ముని అట్టహాసంగా ఆయా రాష్ట్రాలనుంచి వచ్చిన వాళ్ళకి బహూకరించారు.. సర్లెండి.. దేశం పేరు నిలబెట్టారు కదా ఆటగాళ్ళు అనుకుందాం..

మధ్యలో పఠాన్ సోదరుల గురించి తవ్వి తీసి మీడియా వాళ్ళు కొంత కంపు చేసారు.. “సెన్సేషనల్” వార్తల కోసం చేసారు అనుకుని దాన్ని పట్టించుకోవద్దు పోనీ…

మరి ఇప్పుడు, వాళ్ళు హైదరాబాద్ లో ఒక మ్యాచ్ కోసం అడుగు పెట్టగానే, ఓ మంత్రి గారింట్లొ సన్మానం చేసేసారు మన వాళ్ళు..

– ఇంతకు ముందు మ్యాచ్ లోనే ఘోరంగా ఓడిపోయారా.. (84 పరుగులు)!

– ఒక్క తెలుగు వాడైనా అంతమంది లోనూ లేడా.. (ఆ రోహిత్ శర్మ కి ఎలాగో తెలుగు వాసనలు అంటుకున్నాయట.. ఏదో ఒక పేపరు జబ్బలు చరుచుకుంది అప్పుడెప్పుడో.. అంతే)

పోనీ సన్మానం చేస్తే చేసారు.. “ఇన్స్పిరేషన్” కోసం అనుకుందాం.. కానీ అంధ్రాలో క్రికెట్ క్రీడ ని అభివృధ్ధి చేస్తాం అని మాటవరసకైనా అన్న పాపాన పోలేదే ఎవరూ?

మరేందుకు చేసినట్టు? ప్రచారార్భాటం కోసమా? ప్రజల డబ్బు తగలెయ్యడానికా.. ఏదొ ఒక ‘purpose’ ఉండాలిగా?!

Add comment October 4, 2007

అబ్బో చాన్నాళ్ళయ్యింది!

నా బద్ధకం అనుకోండి, అంతర్జాలం తో సమస్య అనుకోండి, పని భారం అనుకోండి (ఇది ఖచ్చితం గా సాకు!) మొత్తానికి బ్లాగు రాసి చాలా రోజులయ్యింది…

ఈ మధ్య కాలంలో నేను గమనించిన విషయం కొత్తగా తెలుగు లొ మంచి బ్లాగులు ఎక్కువ సంఖ్య లో రావటం… నాకు రాయటానికి సమయం కుదరకపోయినా, తేనెగూడు ని, కూడలి ని చూస్తూనే ఉన్నా.. ముఖ్యంగా ఊకదంపుడు (http://vookadampudu.wordpress.com) గారి బ్లాగు నాకు తెగ నచ్చేసింది.. అందుకే ఈ పోస్టులో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా! అలాగే teluguman గారు రామసేతు రాజకీయాల గురించి ఆవేశం తో రాసినా నిజాలు రాసారు..

2 comments October 2, 2007

Previous Posts


Categories

Blogroll

Friends

General

Feeds

 

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Recent Posts

Firefox 3