Posts filed under 'సరదాకి'
MMTS ప్రయాణం…సౌకర్యం, సుఖవంతం!
(మీరు హైదరాబాద్ నుంచి సొంతూరుకి రైలు లో వెళ్ళాలనుకోండి.. స్టేషన్ కి వెళ్ళడానికి MMTS నే వాడండి.. ఎందుకంటే…)
అక్టోబరు 24వ తేదీ.. దీపావళి కి ఇంటికి వెళ్ళడానికి నెల ముందే గౌతమి ఎక్స్ ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకున్నా… సికింద్రాబాద్ లో 9:15కి బయల్దేరుతుంది.. హైదరాబాద్ ట్రాఫిక్ లో కొండాపూర్ నుంచి స్టేషన్ వరకూ బస్సులో వెళ్దామనుకుంటే, ఆ రోజు కూడా సెలవు తీసుకుని ఒక నాలుగు గంటలు ముందు బయల్దేరాలి.. పోనీ ఆటో లో వెళ్ళాలంటే, మా ఊరు వెళ్ళడానికి అయ్యే ఖర్చుకి రెట్టింపు సమర్పించుకోవాలి.. అందుకని…. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా.. ఈ సారి MMTS లో వెళదాం అని….
7:30 కి హైటెక్ సిటీ నుంచి ఒక MMTS రైలు ఉందనీ.. 8 కల్లా సికింద్రాబాద్ వెళ్తుందనీ చెప్పారు మా కొలీగ్స్.. పొనీ ఎంత లేట్ అయినా 9:15 లోపు వెళ్ళిపోతా అనుకున్నాను.. (ఎలాగా గంట పైగా ఖాళీ ఉంటుంది కదా, హోటల్ స్వాతి లో డిన్నర్, కాస్సేపు అలా షాపింగ్, ఇంకా చాలా అనుకున్నా లెండి…) కంపెనీ షటిల్ తీసుకుని, 7:20కల్లా స్టేషన్ లో ఉన్నా…. అక్కడ క్యూ చూస్తే, రెండు కౌంటర్లు, 70 మంది దాకా జనం…. రైలు వచేస్తుందేమో అని కంగారు పడ్డా.. అక్కడే క్యూ లో ముందు ఉన్న ఒక అతన్ని ప్రాధేయపడి, నాకొక టికెట్ కొనిపించి, కంగారుగా ప్లాట్ ఫాం మీదకెళ్ళా.. అక్కడొక 400 మంది దాకా ఉన్నారు….అసలు ఇంతమంది రైలులో ఎలా పడతారని సందేహం వచ్చింది.. అసలే నా చేతిలో రెండు బ్యాగులు…. టైం 7:45 అయ్యింది… 8 అయ్యింది… 8:10 అయ్యింది.. అప్ప్పుడొచ్చింది రైలు.. కానీ లింగంపల్లి వెళ్ళేది….. ఇంకా అది లింగంపల్లి వెళ్ళి తిరిగి రావాలని అర్ధమైంది,…. హైటెక్ నుంచి ఆ టైం లో రోడ్ మార్గంలో వెళ్ళడం కంటే, ప్రయాణం మానుకోవడం మంచిది…. ఈ లోపు, నాంపల్లి వెళ్ళే MMTS రైలు వస్తోందన్నారు… సరేలే, బేగంపేటలో దిగి, అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చులే అనుకుని రైలెక్కా.. నా టికెట్ తీసుకున్నతని రైలు 8:30 కట… ఇంకేంటి వెళ్ళేది, ప్రయాణం కాన్సిల్ చేసుకున్నానని చెప్పి, ఆ టికెట్ నాకిచ్చేసి చక్కాపోయాడు.. నేనుమాత్రం భారతీయ రైల్వే మీద అపారమైన నమ్మకం తో నాంపల్లి రైలెక్కేసా… మధ్యలో సిగ్నల్ కోసమో దేని కోసమో, రెండుసార్లు ఆపేసాడు.. చుట్టూ చీకటి.. నాకు వేరే ఛాయిస్ ఎలాగా లేదు.. నెమ్మదిగా ఒక్కొక్క స్టేషన్ వస్తున్నాయి…. పెట్టె నిండా జనం.. చుట్టూ టిఫిన్ బాక్సులు, సంచీలు, పెట్టెలు.. ఏది ఎవరిదో అస్సలు తెలియదు… ఇందులో రోజూ ప్రయాణించే వాళ్ళ మీద జాలి వేసింది… ఎందులో బాంబు ఉందా అని నేను అలా ఆలోచిస్తూ ఉండగా, .”ప్రకృతి చికిత్సాలయం” వచ్చింది… తర్వాతి స్టేషనే బేగంపేట.. కానీ ఇలా రైలు ప్రారంభం అవ్వగానే, దాని “ఇంజిను ఆగిపోయింది”.. బస్సులూ అవీ ఆగిపోవడం విన్నాను కని ఇలా రైలు ఆగిపోవదం నాకోసమెనేమో…. నా అదృష్టం బాగుండి.. ఒక ఐదు నిమిషాల తర్వాత ఎలాగో ప్రారంభమయ్యింది….
బేగంపేట వెళ్ళే సరికి 8:30… ఆటో తీసేసుకుందాం అరగంట టైం ఉంది కదా అనుకున్నా.. ఒక్కడూ రానంటాడే..”సార్.. స్టేషన్ కాడ మొత్తం జాం అయ్యినాది…వెళ్ళలేం సార్”.. అంటాడు.. నాకేం చెయ్యాలో అర్ధం కాలా.. ఈ లోపు 8:40 అయ్యింది.. ఇందాకా నేను ఎక్కని రైలు (లింగంపల్లి వెళ్తూంటే చూసినది) వస్తొందని ప్రకటించాడు… సరే.. ఎదో ఒక దారి దొరికిందిలే అనుకున్నా… ఈ స్టేషన్లో ఒక 200 మంది ఉన్నారు.. అది నెమ్మదిగా 8:50కి వచ్చింది… నిజంగా “రైలు నిండిపోవడం” అంటే ఎమిటో అప్పుడు అర్ధమయ్యింది… నా బ్యాగులు కాదు కనీసం చెయ్యి పెట్టడానికి వీల్లేకుండా ఉంది…కిటికీలు కూడా ఖాళీ లేవు..(జనాలు ఆల్రెడీ వేళ్ళాడుతున్నారు)…నాకు ఏం జరుగుతోందో అర్ధమయ్యేలోపు నా బ్యాగులతో సహా కిందికి తొయ్యబడ్డాను. రైలు కనీసం 20 సెకనులు కూడా ఆగకుండా బయలుదేరేసింది… ఇంటికి వెళ్ళిపోయి, తర్వాతి రోజు పొద్దున్న జన్మ భూమి ఎక్కాలేమో అనుకున్నా… పరుగుతో స్టేషన్ బైటకి.. మైసమ్మ గుడి దాకా వచ్చా…. అప్పుడే ఒక ఆటో అతను వచ్చి ఆగి ఉన్నాడు… “భయ్యా… .9:15 కో గాడీ హై” అన్నా.. అప్పటికి టైం 8:55… ఎక్కమన్నాడు… “గౌతమి నా సార్?” అనడిగాడు.. అవునన్నా.. ప్లాట్ ఫాం 10 అని, అది స్టేషన్ కి అవతలి వైపు ఉంటుందని.. తనకి షార్ట్ కట్ తెలుసని…వెళ్ళిపోతాం సార్ అని భరోసా ఇచ్చాడు!!.. మినిష్టర్స్ రోడ్, PG రోడ్, ఇంకా నాకు తెలియని రోడ్లు కొన్నింటిలోంచి తీసుకెళ్ళాడు.. నిజానికి నేను బయలుదేరేటప్పటికి నా టికెట్ కంఫర్మ్ అవ్వలేదు…ఈ హడావుడిలో ఉండగానే, ఫ్రెండ్ కి ఫోన్ చేసి, PNR నంబరు ఇచ్చా.. సరిగ్గా 9:08 కి ప్లాట్ ఫాం 10 ముందు ఆపాడు…. 200 ఇవ్వండిసార్ అన్నాడు.. నీకు అంత ఇస్తే నేను మా ఊరు వెళ్ళలేను బాబూ అని చెప్పి.. నా దగ్గరున్న 150 లో వంద కాయితం అతని చేతిలో పెట్టీ, లోపలికి పరిగెత్తా…
అప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇండియన్ రైల్వేస్ site 500 Internal Server Error ఇస్తోందిరా అని చెప్పాడు… అయితే నువ్వు దాన్ని debug చెయ్యరా అని చెప్పి ఫోన్ పెట్టేసా… అప్పటికి 9:12.. కడుపులో ఎలుకలు స్వైర విహారం చేసున్నాయి.. గౌతమి బయలుదేరిందంటే తినడానికి గడ్డి కూడా దొరకదు… అందుకని అక్కడే ప్లాట్ ఫాం మీద మూడు రోజుల కింద ఫ్రెష్ గా చేసిన గడ్డి (సమోసాలు) మూడు తీసుకున్నాను… అటు పక్కన TC, ఉన్నాడు కానీ అతని చుట్టూ ఒక 20 మంది ఉన్నారు.. WL వాళ్ళనుకుంటా.. నాకేం.. నేను RAC కదా.. ఎదో ఒక దాంట్లో కూర్చుందాం అని లోపలికి ఎక్కేసా… అప్పుడే, మా ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేసి.. ఆ సైట్ పని చేసింది రా.. S5 61 అన్నాడు.. నెను S12 దగ్గర ఉన్నాను… టైం 9:18… రైలు బయల్దేరేసింది… వెంటనే లోపలికి దూకేసి.. నడుచుకుంటూ వెళ్ళి నా సీట్ లో కూలబడ్డాను…
P.S.:1. ఇది నిజంగా జరిగిందే.. ఏ కల్పనా లేదు..
2. ఆ సమోసాలు తినడం వల్ల తర్వాతిరోజు నా పొట్టకేమైందన్నది అప్రస్తుతం.
3. ఆ ఆటో అతను అప్పుడే, నాంపల్లిలో ముంబాయి ఎక్స్ ప్రెస్ మిస్ అయిన ఒకతన్ని బేగంపేట లో దింపి ఆటో ఆపాడట…
11 comments November 6, 2008
జీవో ఆరొందల పది!!
ఇందులో ఈ జీవో ని నేను ప్రశ్నించను.. దాని ఉద్దేశ్యం సరైనదే అనుకుంటాను.. కానీ దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఇచిన నిబంధన ఒకటి నాకు వింతగా అనిపించింది…!!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకొవాలి.. కాబట్టి, 4 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ ఎక్కడ చదివితే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారట… ఇందులో వచే చిక్కుల గురించి ప్రభుత్వం ఆలోచించలేదా?! ఎప్పుదో చిన్నప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళ తల్లిదంద్రులు ఎదో ఒక ప్రాంతం లో ఉండడం వల్ల ఆ ప్రాంతం లొ చదివితే, వాళ్ళు ఆ ప్రాంతీయులైపోతారా?! మరి వేరే ప్రాంతీయులని పెళ్ళి చేసుకుని ఇంకో చోట స్ఠిరపడిన వాళ్ళ సంగతి?! భార్యాభర్తలలో ఒకళ్ళు తెలంగాణా, ఇంకొకళ్ళని కోస్తా లో చదివి, వాల్ల పిల్లలు సీమ లో చదివితే ఎవరిని వాళ్ళ ప్రాంతానికి పంపించేస్తె సరి.. సమ న్యాయం ఇచినట్టుంటుంది.. పదండి అలాంటి కుటుంబాలేమైనా ఉన్నాయేమో వెతుకుదాం!
7 comments April 7, 2007


